దేశంలోనే తొలిసారిగా నిర్మించిన ర్యాపిడ్ రోడ్డును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరులోని బిన్నమంగళ సర్కిల్‌లో ప్రీకాస్ట్ పోస్ట్ టెన్షనింగ్ కాంక్రీట్ పేవ్‌మెంట్ సాంకేతికత సాయంతో ర్యాపిడ్ రోడ్డును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇందులో 375 మీటర్ల మార్గాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఆదిత్య ఆలాట్ర్ టెక్ సంస్ధ సహకారంతో దీన్ని చేపట్టారు. ఈ రోడ్ల నిర్మాణం వల్ల రహదారులను క్యూరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన భాషలో చెప్పాలంటే రోడ్ల బ్లాకులను వేరేచోట తయారు చేయించి రహదారులకు అమర్చడమన్నమాట. ఖర్చు తగ్గి నాణ్యతా ప్రమాణలు అధికంగా ఉన్నట్లు ధ్రువపడితే మరిన్ని ప్రాంతాల్లో ర్యాపిడ్ రోడ్లను నిర్మిస్తామని బొమ్మై ప్రకటించారు.