ఇంకా ఎన్నికలు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయమున్నా టీడీపీలో ఇపుడే టిక్కెట్ల లొల్లి మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. ముందే కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇదిలావుంటే టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈసారి చావో రేవో తేల్చుకోవాలని బరిలోకి దిగుతోంది. అధినేత చంద్రబాబు, ఇటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు జనంలోకి వెళుతున్నారు. చంద్రబాబు ఇందే ఖర్మ మన రాష్ట్రానికి అంటూ జిల్లాలవారీగా పర్యటనకు వెళుతుంటే. లోకేష్ జనవరిలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడుతుంటే.. నియోజకవర్గాల్లో నేతలు మాత్రం కుస్తీలు పడుతున్నారు. గ్రూప్ వార్ మరింత ముదురుతోంది.. కొన్నిచోట్ల ఒకే నియోజకవర్గంపై ఒకరిద్దరు నేతలు ఆశలు పెట్టుకోవడంతో విభేదాలు భగ్గుమంటున్నాయి. అందరూ కలిసి ముందుకు సాగాలని చంద్రబాబు చెబుతున్నా నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆధిపత్యం కోసం కుమ్మలాటలకు పోతున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం.. మొదటి నుంచి టీడీపీకి బలమైన కేడర్ ఉంది. 2014 ఎన్నికల్లో విజయం సాధించినా 2019లో ఓటమి ఎదురైంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీడీపీకి గ్రూప్ వార్ తలనొప్పిగా మారింది. నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి వర్గాల మధ్య ఆధిపత్యం నడుస్తోంది. హనుమంతరాయచౌదరి 2014లో ఎమ్మెల్యేగా గెలవగా.. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ దక్కలేదు. టీడీపీ అభ్యర్థిని మార్చేసి ఉమామహేశ్వర నాయుడుని పోటీ చేయించగా.. ఆయన ఓడిపోయారు.
కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉమామహేశ్వరనాయుడు ఉన్నా సరే.. హనుమంతరాయ చౌదరి కూడా తాను రేసులో ఉన్నానంటున్నారు. రెండు గ్రూపులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అప్పుడప్పుడు బలప్రదర్శనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ పదవుల ఎంపిక విషయంలో రెండు గ్రూపులు గొడవకు దిగాయి. అనంతపురంలో ఈ సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
తమ వర్గాలకే పదవులు కావాలంటూ వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ సమావేశం మధ్యలోనే ఆగిపోయింది. ఉమామహేశ్వరనాయుడు తనకు టికెట్ ఖాయమని అంటుంటే.. హనుమంతరాయ చౌదరి కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కానీ కుమారుడు మారుతికి కానీ టికెట్ ఇవ్వాలంటున్నారు. అంతేకాదు స్థానికులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ఓవైపు నేతలంతా సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని అధినేత చంద్రబాబు చెబుతుంటే.. ఇక్కడ నేతలు మాత్రం కుస్తీలు పడుతున్నారు. ఆధిపత్య పోరుతో కేడర్‌ను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారు. అధిష్టానం కూడా ఎటూ తేల్చకపోవడంతో రెండు గ్రూపుల మధ్య వార్ నడుస్తోంది. ఇంఛార్జ్‌ను ప్రకటించినా.. ఎన్నికల సమయానికి ఎవరికి టికెట్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది. అటు హనుమంతరాయచౌదరి, ఇటు ఉమామహేశ్వరనాయుడులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. మరి ఈ ఆధిపత్య పోరుకు చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa