యర్రగుంట్ల పట్టణంలో స్థానిక పురపాలిక పరిధిలోని వినాయక నగర్లో బుధవారం అగాపె పౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి స్పందన లభించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ వర్రా చంద్రకళ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పేదల
ఆరోగ్య పరిరక్షణ కోసం అగాపె ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరు తమవంతు బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు.
అగాపె చైర్మన్ జాన్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తమ వంతుగా సేవా భావంతో వైద్యశిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కాగా ఈ శిబిరంలో 200 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి పుష్పగిరి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ప్రయాణ, భోజన వసతులను కూడా భరించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అఖిల, భార్గవి, రేణుక, సిబ్బందితో పాటు ట్రస్టు సభ్యులు సత్యసామేలు, మాబు బాష, రిక్కి, యోహాను తదితరులు పాల్గొన్నారు.