పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఘటనపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... భారతదేశంలో ఎక్కడా లేని అరాచకం ఏపీలోనే జరుగుతోందన్నారు. ప్రతిపక్ష నేతలపై విద్వాంసకాండకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పడానికి మాచర్ల ఘటన ఉదాహరణ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో, అరాచకంలో, అవినీతిలో నెంబర్వన్‌గా నిలిచిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి ఓటు వేస్తే... ఇక ఆంధ్రాలో ఉండే అవకాశం లేదన్నారు. ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించుకోవాలంటూ హితవుపలికారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఎమ్మెల్యేలకు రూ.40 కోట్లు ఇస్తామని చెప్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. ఆంధ్రాలో జరుగుతున్న ఆర్థిక అవినీతిపై చర్యలు తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.