ఆంధ్రప్రదేశ్‌లో 17883.69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 22 జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్ట్‌లను చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లు వేర్వేరు దశల్లో అమలులో ఉన్నట్లు తెలిపారు. 17883 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన రహదారుల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్ట్‌ల కోసం ఈ ఏడాది నవంబర్ 25 నాటికి 5042.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2909 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి 6 లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం ఇప్పటికే 1641.75 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అలాగే 1194.57 కోట్ల వ్యయంతో చేపట్టిన గొల్లపూడి- చిన్నకాకాని విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 281.94 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. 1128.68 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆలూరు- జక్కువ సెక్షన్ ఆరు లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం 112.36 కోట్ల రూపాయలు, 767.75 కోట్లతో చేపట్టిన జక్కువ-కొర్లాం సెక్షన్ 6 లేన్ల రహదారి పనుల కోసం 113.58 కోట్లు, 957.43 కోట్లతో చేపట్టిన కొర్లాం-కంతకాపల్లి 6 లేన్ల అభివృద్ధి కోసం 247.97 కోట్లు, 923.81 కోట్లతో చేపట్టిన కంతకాపల్లి-సబ్బవరం 6 లేన్ల అభివృద్ధి కోసం 142.86 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గన్నవరం సమీపంలో విజయవాడ ఎయిర్ పోర్టు వద్ద జాతీయ రహదారిపై హాఫ్ ఫ్లైఓవర్‌ను 29.34 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. 1889 కోట్లతో రేణిగుంట-నాయుడుపేట మధ్య 6 లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం 322.59 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17883 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కింద 2022 నవంబర్ 25 నాటికి 5042.74 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.