పలమనేరు అటవీ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలపై పలమనేరు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు... సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై సీఐ స్పందించి పలమనేరు అటవీ ప్రాంతంలో మొరం సమీపంలోని పెంట పరిసరాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేయించారు. పలమనేరు ఎస్‌ఐ నాగరాజు, ఎస్‌ఐ సుబ్బారెడ్డి, స్పెషల్‌బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు, సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకొన్నారు. వీరి నుంచి 16 మోటరు సైకిళ్లను, 17 సెల్‌ఫోన్లు, రూ.3,86,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా పేకాట నిర్వహిస్తున్న పలమనేరు మండలం కొలమాసనపల్లికి చెందిన శంకర, పెద్దపంజాణి మండలం అప్పినపల్లికి చెందిన వెంకటేష్ పరారీ అయ్యారు. కాగా ఈ దాడుల సందర్భంగా పేకాట ఆడుతూ కొలమాసనపల్లికి చెందిన సిద్దప్ప, నాగార్జున, అప్పినపలికి చెందిన సల్మాన్‌ఖాన్, ఖాసీం, పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వేణు, బైరెడ్డిపల్లి మండలం తవడకుప్పానికి చెందిన సురేష్, మదనపల్లెకు చెందిన సుమన్‌రెడ్డి, పుంగనూరుకు చెందిన నరేంద్రనాయక్ మరికొందరు పరారీ అయినట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులు వెంకటేష్, శంకర పేకాట స్థావరాలను తరచూ మార్చుతూ స్థలాలను ఎప్పటికప్పుడు పేకాట రాయుళ్లకు తెలియజేస్తున్నట్లు సీఐ తెలిపారు. అంతేకాక ప్రతి ఒక్కరి వద్ద రూ.1000 చొప్పున వసూలు చేస్తూ పేకాటలో లోపలబైటను ఆడిస్తుంటారని తమ విచారణలో తేలిందని సీఐ తెలిపారు.