మనదేశంలో వివిధ గ్రామాల్లో వివిధ రకాల ఆచరాలు ఉంటాయి. ఇదిలావుంటే విశాల భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ఆచారాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. టెక్నాలజీ యుగంలోనూ విడ్డూరంగా అనిపించే నమ్మకాలను ప్రజలు పాటిస్తుండడం దేశంలో కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఏపీలోని అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామంలోనూ ఇలాంటిదే ఓ ఆచారాన్ని తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున తలారిచెరువు గ్రామం అంతా ఖాళీ అవుతుంది. గ్రామస్తులందరూ తమ ఇళ్లను వదిలి ఓ దర్గా వద్దకు చేరుకుంటారు. పెంపుడు జంతువులు సహా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతారు. దీన్ని 'అగ్గిపాడు' ఆచారం అని పిలుస్తారు.
ఇలా చేయడం ఎందుకంటే.... పూర్వం ఓ బ్రాహ్మణుడ్ని చంపిన పాతకం చుట్టుకోకుండా 'అగ్గిపాడు' పేరిట ఆచారాన్ని పాటిస్తున్నామని తలారిచెరువు గ్రామస్తులు చెబుతుంటారు. అగ్గిపాడు ఆచారం అంటే... గ్రామంలోని ఏ ఇంటిలోనూ అగ్గి, వెలుగు లేకుండా దీపాలు ఆర్పేస్తారు. అందరూ గ్రామానికి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుని పౌర్ణమి రోజంతా గ్రామానికి దూరంగా ఉంటారు. దర్గా వద్దే వంట వార్పు చేసుకుంటారు. పౌర్ణమి ఘడియలు పూర్తయిన తర్వాత తిరిగి గ్రామానికి చేరుకుని ఇళ్లలో పూజలు జరుపుతారు.
చాలాకాలం కిందట ఊళ్లో పసికందులు పురిట్లోనే చనిపోతుండడంతో గ్రామస్తులు ఓ జ్యోతిష్కుడ్ని ఆశ్రయించారట. ఆ గ్రామంలోని వారు ఓ బ్రాహ్మణుడ్ని చంపడంతో బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుని, పసిబిడ్డలు మృత్యువాత పడుతున్నారని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అది పోవాలంటే, మాఘ చతుర్దశి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు 'అగ్గిపాడు' ఆచారం పాటించాలని ఆ జ్యోతిష్కుడు ఇచ్చిన సలహానే తలారిచెరువు గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు.