ప్రేమలు ఖండంతారాలు దాటి పెళ్లిల వరకు రావడం నిజంగా ఓ వరమే. ఉద్యోగ రీత్యా లండన్‌లో ఉంటున్న భారత అమ్మాయిపై మనసు పడ్డాడు అక్కడి యువకుడు. ఆమె కోసం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వచ్చాడు. బంధుమిత్రుల కేరింతలు, లండన్ వాసుల డ్యాన్సుల మధ్య భారతీయ సంప్రదాయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంగ్లండ్ నుంచి ఈ పెళ్లికి వచ్చిన అతిథులు భారతీయ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఔరంగాబాద్‌కు చెందిన సాంచి, ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ ఒకర్నొకరు ప్రేమించుకుంటున్నారు. నాలుగేళ్లుగా వీళ్లు రిలేషన్‌లో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో వాళ్లకు తెలియడంతో తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లికుమారుడు ఎడ్వర్డ్.. గుర్రంపై మండపానికి వస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. బ్యాండ్ మేళానికి తగినట్టు వధూవరులు అదరగొట్టేలా నృత్యం చేశారు.
సాంచికి ఎప్పటికైనా పెళ్లి జరిపించి మరో ఇంటికి కోడలిగా పంపించాలని ఊహించిందే. కానీ, ఆమె ఇప్పుడు సప్తసముద్రాలు దాటి వెళ్తుండటం బాధగా ఉంది. అయితే, అమ్మాయి మంచి కుటుంబంలోకి వెళ్తుందనే సంతృప్తి మాత్రం ఉంది’ అని వధువు తండ్రి అన్నాడు. పెళ్లి భారత్‌లోనే జరగాలని అమ్మాయి తల్లిదండ్రులు కండీషన్ పెట్టారు. బౌద్ధ సంప్రదాయ పద్ధతిలో ‘సాంచి’ వివాహం జరిపించారు. పెళ్లిలో ఎడ్వర్డ్ సోదరి, అతడి తల్లిదండ్రులు భారతీయ దుస్తులు ధరించి, భారతీయ పాటలకు డ్యాన్స్ చేశారు.
బ్రిటన్‌లో పెళ్లి అనేది ఒక గంట కార్యక్రమం. కానీ, ఇండియాలో మాత్రం 4 రోజుల వేడుక. ఇదంతా సరదాగా సాగిందని ఎడ్వర్డ్ తండ్రి చెప్పారు. కులాలు, మతాల హద్దులే కాదు.. దేశాల అడ్డుగోడలను కూడా ఛేదించి ఈ పెళ్లి జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఔరంగాబాద్‌లోని ఓ రిసార్టులో సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం వీరి పెళ్లి జరిగింది. ఊరేగింపులో ఓ వైపు కుటుంబసభ్యులంతా చిందులు వేస్తుంటే.. ఈ లవర్స్ మాత్రం ముద్దుల్లో మునిగిపోవడం కొసమెరుపు.