ఏపీ నూతన గవర్నర్‌గా నియమించబడిన అబ్దుల్ నజీర్ ను నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో కలిశారు. ఈ విషయాన్ని ఎంపీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 'మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి అభినందనలు తెలిపిన నరసాపురం ఎంపీ శ్రీ రఘురామకృష్ణ రాజు'. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు ఫోటోను ట్వీట్ చేశారు. అయితే ఎంపీ రఘురామ ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ, టీడీపీల కంటే ముందుగానే కొత్త గవర్నర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దేశంలో కీలకమైన అయోధ్య, ట్రిపుల్ తలాక్ కేసులలో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పదవీ విరమణ చేశారు.. ఇప్పుడు ఏపీ గవర్నర్‌గా నియమించారు. త్వరలోనే అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయ్యారు.
మరోవైపు ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ మరువలేని సహకారం అందించారన్నారు ప్రశంసించారు. అలాగే సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు.