జగన్‌లో నాయకత్వ లక్షణాలు లేవన్న పోసాని.. ప్రజాసేవ లక్షణాలే ఉన్నాయని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని నాయకుల్లో తనకు మోదీ, జగన్ అంటే ఇష్టమన్నారు. మోదీ లాంటి వ్యక్తి ప్రధాని సీట్లో కూర్చుంటే ఈ దేశం నాశనం కాదన్న ఆయన. మోదీ కోసం తాను ఏదైనా చేస్తానన్నారు. జగన్ ప్రజల పట్ల నిజాయతీతో ఉంటారన్న పోసాని.. ఆయన జనాలకు సేవకుడిగానే ఉంటారన్ననారు. జగన్‌లో నాయకత్వ లక్షణాలు లేవన్న పోసాని.. ప్రజాసేవ లక్షణాలే ఉన్నాయని కొనియాడారు. జగన్ ప్రజల కోసం ఏమైనా చేయాలని అనుకుంటాడన్నారు. ‘ప్రజలు వద్దంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతా.. అయినా వాళ్ల మధ్యే ఉంటానని జగన్ అనుకుంటాడు. ఈ క్వాలిటీ నాకు నచ్చింది’ అని పోసాని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘వైఎస్ చనిపోయాక.. ఓదార్పు యాత్ర కోసం పర్మిషన్ అడిగేందుకు జగన్, విజయమ్మ కలిసి సోనియాను కలవడానికి ఢిల్లీ వెళ్లారు. కానీ ఓదార్పు యాత్రకు సోనియా నిరాకరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలని జగన్ నిర్ణయించుకున్నారు. వైఎస్ పేరిట పార్టీ పెట్టి జనంలోకి వెళ్లాలని అనుకున్నారు. ఓదార్పు యాత్రతో అందర్నీ కలిశాడు. అమ్మ, చెల్లితోనే జగన్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆంధ్రాలో నంబర్ వన్ ప్రజాసేవకుడిగా జగన్ మిగిలారు. ఇదీ జగన్ నిజాయతీ. కానీ చంద్రబాబు తీరు దీనికి పూర్తి విరుద్ధం. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాక టీడీపీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీని, రామారావును వెన్నుపోటు పొడిచారు. ఎవరు నిజాయతీపరుడో.. ఎవరు సైకోనో మీరే నిర్ణయించండి’’ అని పోసాని వ్యాఖ్యానించారు.