ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. శాసన మండలిని రద్దు చేయాలని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ఆయ న సూటిగా ప్రశ్నించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు సీఎం జగన్ ఏకపక్షంగా మండలి రద్దుకు తీర్మానం చేశారని పేర్కొన్నారు. శాసన మండలి వ్యవస్థను అగౌరవ పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు అడుగుతారని నిలదీశారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై మంగళవారం పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులతో చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని నేతలకు సూచించారు. పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైన జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో టీడీపీ నేతల పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో.. దాడులు, హింసాత్మక ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు. కరడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం జగన్ ప్రవర్తిస్తుంటే.. కొందరు పోలీసుల బాధ్యత మరిచి జగన్‌కు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.