సీమ ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా శనివారం కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి రూ.5,300 కోట్లు ఇచ్చిందని, దీనిపై ఏపీ, తెలంగాణ సీఎంలు నోరువిప్పడం లేదని మండిపడ్డారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కాలువల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని, అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాజెక్టులకు సాగునీరందక సీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. జగన్‌కు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.