లింగాల మండలం లింగాల, పెద్ద కుడాల , చిన్న కుడాల గ్రామాలలో వెలసిన గంగమ్మ దేవత తిరునాల ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద కుడాల ఆలయ కమిటీ చైర్మన్ జయ చంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరునాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. మండల వాసులే కాక పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా అనంతపురం, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ ఇలవేల్పును దర్శించుకున్నారు. అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి ముక్కు తీర్చుకున్నారు. జంతు బలులను ఇచ్చారు. పెద్ద కుడాల గ్రామంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. లింగాల ఎస్సై హృషికేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.