శ్రీకాకుళం జిల్లాలో గత వైభవ చిహ్నాలుగా ఇంతవరకు గుర్తించబడని అనేక చారిత్రక కట్టడాలు ఇప్పటికి నిలిచి ఉన్నాయని వాటిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించాలని, ఈ మేరకు ఇంటాక్ ఢిల్లీ కేంద్ర కార్యాలయం కోరిందని ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసిరావు అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవన్ లో జరిగిన ఇంటాక్ కార్యనిర్వాహకవర్గ అత్యవసర సమావేశం సన్యాసిరావు అధ్యక్షతన జరిగింది. జిల్లాలో చరిత్ర ప్రసిద్ధి చెందిన మెట్ల బావులు రెండు ఉన్నాయి, వాటిని స్వచ్చంద సంస్థల సహకారంతో పునరుద్ధరించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ నెల 23 వ తేదీన జిల్లాలో కార్యనిర్వాహక వర్గ సభ్యులతో కొన్ని చారిత్రక ప్రదేశాల ప్రత్యేక సందర్శన చేపట్టాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా పర్యాటక అధికారి నడిమింటి నారాయణరావు సూచనల మేరకు యువ పర్యాటక క్లబ్బుల ఇంటాక్ సంపూర్నంగా సహకరించాలని అలాగే మరుగున పడిపోతున్న శిలా శాసనాలను, శిధిల చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి చేయాలని తీర్మానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి లో ఒక శిధిల కోట ఉన్నట్లుగా గుర్తించామని వివరాలు సేకరిస్తున్నామని నారాయణ రావు అన్నారు. పి. జగన్మోహనరావు సీనియర్ సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో ఇంటాక్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఇంటెక్ అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాధ నాయుడు మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రదేశాలలో స్థానికులతో అవగాహనా సదస్సులు ఏర్పాటుచేసి, వాటి పరిరక్షణకు ప్రణాళిక సిద్ధం చేద్దామన్నారు. ఈ సమావేశంలో వావిలపల్లి జగన్నాధ నాయుడు అదనపు కన్వీనర్, ఎన్. మోహన్ కో కన్వీనర్ కె. వి. జె రాధా ప్రసాద్ పూర్వ అధ్యక్షులు , సురంగి మోహన రావు పూర్వ కో కన్వీనర్ కొమ్ము రమణ మూర్తి, కె. ఎన్. ఎస్. వి ప్రసాద్(హారికాప్రసాద్) తదితరులు పాల్గొన్నారు.