అగ్రిగోల్డ్ బాధితుల కోసం బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని, యాజమాన్యం అక్రమంగా విక్రయించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. పాదయాత్ర సందర్బంగా బాధితులకు ఇచ్చిన హామీని జగన్ నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు, అసహజ మరణాలకు పాల్పడిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైన డిమాండ్ల సాధనలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 15, 16 తేదీల్లో విజయవాడ ధర్నాచౌక్‌లో రిలే నిరాహారదీక్షలు, 17న సామూహిక సత్యాగ్రహం నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రూ.1183 కోట్లు కేటాయించి 14 లక్షల మందికి న్యాయం చేస్తానని అసోసియేషన్ సభకు వచ్చి జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాబోయే మూడు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే జూన్ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ముందుకు రాకుంటే అన్ని పార్టీలను ఈ అంశంపై ఒకే వేదికపైకి తీసుకొస్తామని ముప్పాళ్ల స్పష్టంచేశారు.