తనకల్లు మండలం నల్లగుట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి మీనాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు ప్రవర్తన అసభ్యకరంగా ఉందని విచారణలో రుజువు కావడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పాఠశాలలో ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంలో ప్రధానోపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న తీరుగురించి బాలికలు ఆ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరు ఆదేశాల మేరకు డీఈవో మీనాక్షి, కదిరి, తనకల్లు ఎంఈవోలు చెన్నకృష్ణ, లలితమ్మ ఈ నెల 6న పాఠశాలలో విచారణ జరిపించారు. విచారణ నివేదిక ఆధారంగా ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ అతనిపై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేయాలని డీఈవో నుంచి ఆదేశాలు అందాయి. దీంతో తనకల్లు ఎంఈవో లలితమ్మ 59 పేజీల విచారణ నివేదికతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.