జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటేశ్వరరెడ్డిలతో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉపాధ్యాయులకు రూ.5 వేలు, పట్టభద్రులకు రూ.2-3 వేలతో ఓట్ల కొనుగోలుకు సై అంటున్నారన్నారు. మైనింగ్, ఇసుక, లిక్కరు అక్రమ వ్యాపారాల్లో రూ.వేల కోట్లు సంపాదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. మేధావులైన పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని విన్నవించారు. శాసన మండలిలో బలం కోసం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నారు. జగన్ అధికార పిచ్చి పరాకాష్టకు చేరి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు.