జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థాపించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జనసేన జెండాను ఎగరవేయాగ జనసైనికులు జెండా వందనం చేశారు. అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.
అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జనసైనికులు, అభిమానులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన తీవ్ర నిరాశ నిసృహులకు లోనయ్యి ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో యువత పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. అందుకు ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభ విజయవంతం కావడమే నిదర్శనం అన్నారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు జనసేన అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి ఇంత మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. సుమారు 100కి పైగా జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, పీతల మదుసూదన్ రావ్, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.