ఔనండీ. ఓటమి మాట తడబడేలా చేస్తుంది. ఓటమి ఒక్కోసారి నవ్వులపాలూ చేస్తుంది. ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ. బీజేపీ కలిసే ఉన్నట్టు ప్రజలు బలంగా నమ్మారని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయామని ఆయన శనివారం మీడియా ముందు కొత్తపలుకు పలికారు. ఇదే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విశాఖపై ఫోకస్ పెట్టిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సంహారావు విశాఖలో ఎప్పడు మీడియాతో మాట్లాడినా. జనసేనతో పొత్తు కొనసాగుతోందని, పవన్ కల్యాణ్ మావాడేనని, ఏ ఎన్నికలు జరిగినా ఇద్దరం కలిసే పోటీ చేస్తామని పదేపదే చెబుతూ వస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీతో పొత్తు ఉందన్న విషయం ఏనాడు బీజేపీ వాళ్లలు గానీ, ఇటు వైసీపీ గానీ చెప్పలేదు. ఇటీవల విశాఖలో ప్రధాని మోదీ సభలో కూడా ఏపీ సీఎం ఇదే స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం బీజేపీతో స్నేహంగా ఉంటాం తప్పా. రాజకీయంగా కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వైసీపీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా సింహం సింగిల్‌గానే వస్తుందని సోషల్ మీడియా వేదికగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలకు సవాలు విసురుతున్నారు కూడా. అంతేకాదు 2024 ఎన్నికల్లో ఏపీలో ఉన్న అన్ని పార్టీలకు చెక్ పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యూహం. ఇది జరుగుతుందా? జరగదా అనే విషయం పక్కన పెడితే. విష్ణుకుమార్ రాజు మాటలకు అర్థాలే వేరా? అంటే సీఎం జగన్‌తో ఆ పార్టీ నేతలు రహస్య స్నేహం కొనసాగిస్తున్నారా? అనే విషయాలు అంతుపట్టడం లేదు.