ఏపీ జేఏసీ నేతలు మంగళవారం విజయవాడలోని పలు శాఖాధిపతుల కార్యాలయాలను సందర్శించి ఉద్యమానికి మద్దతు తెలిపాలని ఉద్యోగులను కోరారు. ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, 11వ పీఆర్సీలో షెడ్యూల్-2లోని పేస్కేల్స్ అమలు చేయకపోవడం, పీఆర్సీ అరియర్స్ ఇప్పటికీ చెల్లించకపోవడం, జీతాలు 1వ తేదీనే చెల్లించాలన్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడం తదితరాలను ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ...... 11వ పీఆర్సీ కమిషన్ పెంచిన స్కేల్స్ కొన్ని కేడర్‌లకు అప్ గ్రేడ్ చేయకపోవడం వల్ల లక్షలాదిమంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధానంగా 2018 తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీనీ అమలు చేయలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచలేదని వివరించారు.