పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగనున్నాయి. నిర్దేశించిన సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించరు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ 6,09,070 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది ఉన్నారు. ఓపెన్ స్కూల్స్ సొసైటీ విద్యార్థులు 1,525 మంది, వీరిలో సప్లిమెంటరీ రాసేవారు 147 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో కనిపెట్టేందుకు ప్రశ్నపత్రాలపై సీరియల్ నెంబరు ముద్రించే విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. గతేడాది వరకు ఏడు పేపర్ల విధానం ఉండగా, ఈసారి దానిని ఆరు పేపర్లు చేశారు. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, నాచురల్ సైన్స్ రెండు కలిపి ఒకే రోజున పరీక్ష నిర్వహించనున్నారు. 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 కేంద్రాల్లో సీసీ కెమేరాలు అమర్చారు. పరీక్షల ఏర్పాట్లపై బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తారు.