మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిరోదక శాఖ రూపొందించిన జాయింట్ యాక్షన్ ప్లాన్ అమలుపై బుధవారం జిల్లా కలెక్టరెట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, సూపరేంటెండెంట్ అఫ్ పోలీస్ జి. రాధిక సంయుక్తంగా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా సూపరేంటెండెంట్ అఫ్ పోలీస్ జి. రాధిక మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల విక్రయాల నిఘాపై, రవాణా అరికట్టెందుకు చేపడుతున్న ప్రణాళికలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు నెలవారీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నిరోధించాలని, దీనికోసం పటిష్తమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. మత్తు పదార్ధాలు, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్గించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల ను అరికట్టేందుకు విద్యా సంస్థల గోడల పై టోల్ ఫ్రీ నెంబర్ ప్రదర్శించాలన్నారు. దీనికోసం స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. మత్తు కల్గించే పదార్ధాలను విక్రయించే షాపులపై నిఘా పెట్టాలన్నారు. మద్యం షాపుల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మందుల షాపులు, ఇతర ట్రేడర్స్‌తో సమావేశాలు నిర్వహించి, చట్టంలోని అంశాలను వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మైనర్లకు మద్యం, పొగాకు, గంజాయి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల దుష్పరిణామాలను వివరిస్తూ, విద్యాసంస్థల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్లను ప్రదర్శించాలన్నారు.
జిల్లాలో ఎక్కడా గంజాయి పంట లేదన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల వాడకం, రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 14500 టోల్ నెంబర్ కి కాల్ చేయాలన్నారు. ఈ నెంబర్ అందరికీ తెలిసేలా డిస్ప్లే చేసేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్. పి. బాలరాజు, జిల్లా అటవీశాఖ అధికారి నిశాకుమారి, సెంట్రల్ ఇంటెల్జెన్సీ డి. ఎస్. పి కిషోర్, సేల్స్ టాక్స్ ఆఫీసర్ జి. రాణి మోహన్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పి. విటల్ రావు, కస్టమ్స్ ప్రైవేంటివ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి బి. శాంతి జిల్లా వ్యవసాయాదికారి శ్రీధర్, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. పగడాలమ్మ తదితరులు పాల్గొన్నారు.