రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాసుల కక్కుర్తికి పాల్పడ్డాడని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.... రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కనుసన్నల్లో ఆశా వర్కర్ల నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆశా వర్కర్ల నియామకాలు జరిగేలా జిల్లా వైద్యాధికారితో ఉత్తర్వులు తెప్పించుకోవడం అధికార దుర్వినియోగమేనన్నారు. ఆ ఉత్తర్వులను పీహెచసీల్లో పనిచేస్తున్న వైద్యులకు జారీ చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆశా వర్కర్ల నియామకాలకు ఎమ్మెల్యేకు సంబంధంఏమిటని ప్రశ్నించారు. రాయదుర్గం నియోజకవర్గంలో 21 మంది ఆశా వర్కర్ల నియామకాల్లో ఎమ్మెల్యే పీఏ, వైసీపీ నాయకులు లక్షలాది రూపాయలు దండుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకుండా జిల్లా అధికారులపై ఎమ్మెల్యే ఇంకా ఒత్తిడి తెస్తున్నారంటే వైసీపీ నాయకులు వసూలు చేసిన సొమ్ము పూర్తిగా అతనికి అందలేదనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు.