ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ధ్వజారోహణ కార్యక్రమాన్ని టీటీడీ, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా.. నిన్న సాయంత్రం కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి కంకణధారణ చేశారు. అయితే దేశ్యాప్తంగా శ్రీరామనవి రోజు శ్రీసీతారాముల కళ్యాణం జరుగుతుండగా.. ఇక్కడ మాత్రం చైత్ర పౌర్ణమి రోజు కళ్యాణవేడుక జరుగుతుంది. ఏప్రిల్ 5న కోదండరామ స్వామి ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం జరుగనుంది. ఇందుకు కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.