‘‘కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివేకా హత్యకేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలి. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులను కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీతో జగన్ చేసుకున్న ఒప్పందంతో వివేకా హత్యకేసు తీర్పు ఆలస్యం కాబోతుంది. ఆదానీ కేసు తరహాలోనే వివేకా హత్యకేసు కూడా కొలిక్కివచ్చే సమయంలో కేంద్రం సుప్రీం కోర్టు ద్వారా కమిటీ వేయించింది. జగన్ పదేపదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారనేది బట్టబయలైంది. వివేకా హత్యకేసు విచారణ సుప్రీం కోర్టులో చివరిదశకు రావడంతో భయంతోనే డిల్లీకి వెళ్లాడు. కేంద్రాన్ని నిలదీసే శక్తి లేని జగన్ రాష్ట్రాన్ని స్మశానంలా మారుస్తున్నాడు’’ అని నారాయణ మండిపడ్డారు. కేంద్రం రాహుల్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరిని నిరసిస్తూ అన్ని పార్టీలతో కలిపి త్వరలో ఉద్యమం చేపడతామని తెలిపారు.