స్పందనలో వచ్చిన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చూపరాదని జిల్లా సంయుక్త కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు హెచ్చరించారు. స్పందన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ కు విన్నవించారు. కొందరికి తక్షణమే పరిష్కార మార్గం చూపగా, మరికొన్నింటిని పరిశీలన, విచారణకు ఆదేశించారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మొత్తంగా 70 వినతి పత్రాలు నమోదయ్యాయి. కార్యక్రమంలో భాగంగా స్పందన అర్జీలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్నందున స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన పోర్టల్ లో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించేలా అధికారులు పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండింగ్ లో ఉంటే అధికారులు ఇబ్బందులు పడతారని ఆయన వివరించారు. జగనన్నకు చెబుదాం పోర్టల్ లో వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ఆయన తెలిపారు. తదుపరి 294 మంది డి ఎం యు వాహనదారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుర్తింపు కార్డులను జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. లక్ష్మీశివజ్యోతి, సిపిఓ జి. భరత్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.