దేశంలో ఎదురులేకుండా ముందుకుసాగుతున్న బీజేపీకి తాజాగా జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కొరకరాని కొయ్యగా మారారు. ఇదిలావుంటే 2019 పుల్వామా ఉగ్రదాడి విషయంలో జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. పుల్వామా ఆత్మాహుతి దాడికి భద్రతా వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించారు. ప్రయాణానికి విమానం కావాలని పారామిలటరీ దళం చేసిన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించిందని, ఇది జవాన్లు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, జమ్మూ కశ్మీర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి అవగాహన అంతంతమాత్రమేనని విమర్శించారు.
సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయా మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశంసించిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఆయన యూ-టర్న్ విశ్వసనీయత గురించి సందేహాలను లేవనెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించిన అనేక పాత క్లిప్‌లను మాలవీయా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
‘సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ సంతోషించడానికి ముందు రాహుల్ గాంధీ గురించి ఆయన గతంలో ఏం చెప్పారో వినండి’ అంటూ రాహుల్ గాంధీని ‘రాజకీయ మైనర్’ అన్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను ఆయన (రాహుల్) సమర్ధిస్తే జనం చెప్పులతో కొడతారు’ అన్నారు. ‘ఈ ఆరోపణలు చేసినప్పుడు కూడా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఇది అతని విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతుంది.’ అని మాలవీయ ఎదురుదాడికి దిగారు.
అయితే, మాజీ గవర్నర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. పుల్వామా ఘటనపై విచారణ గురించి సమాచారం బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. మాలిక్ ఆరోపణలను ప్రస్తావిస్తూ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోడానికి ప్రధాని మోదీ ఈ సంఘటనను పావుగా వాడుకున్నట్టు ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘కనీస పాలన, గరిష్ట నిశ్శబ్దం’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. పుల్వామా ఘటన గురించి మాలిక్ చేసిన వాదనలపై నోరు విప్పాలని కోరారు.
పుల్వామా ఉగ్రదాడిపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను దేశద్రోహులుగా బీజేపీ అభివర్ణిస్తూ నోరు నొక్కే ప్రయత్నాలు చేస్తోందని శివసేన (ఉద్ధవ్ వర్గం) సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. పుల్వామా దాడిని నిరోధించడంలో బీజేపీ ప్రభుత్వ అసమర్థతపై సమాధానం చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa