బిహార్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల రావడంతో పరిశీలనకు వచ్చిన మైనింగ్ అధికారులపై ఇసుక మాఫియా దాడులకు తెగబడింది. మహిళా ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు అధికారులపై రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. పట్నా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అధికారుల రాకను గమనించి మైనింగ్ ముఠా.. ఇసుకతో నింపిన ట్రక్కులతో సంఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అధికారులు అడ్డుకోవడంతో రాళ్లు రువ్వి, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జిల్లా మైనింగ్ అధికారి, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గాయపడ్డారు.
‘వాళ్లను కొట్టండి.. కొట్టండి’ అంటూ ఓ వ్యక్తి అరుస్తూ అధికారుల మీదకు వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అధికారులను చుట్టుముట్టిన మూక.. వారు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే కర్రలతో కొట్టారు. ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం ఓ ప్రకటన వెలువరించింది. ‘బిహ్తా ప్రాంతంలో అక్రమ మైనింగ్ తనిఖీల్లో భాగంగా ఒక బృందం అక్కడకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.. కోయిల్‌వార్ వంతెన సమీపంలోకి రాగానే అధికారులపై సంఘ వ్యతిరేకులు దాడి చేశారు. నిందితులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో ఇన్‌స్పెక్టర్ అమ్య కుమారి కిందపడి గాయాలపాలైంది’ అని తెలిపింది.
ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు.. 44 మందిపై కేసు నమోదుచేశారు. 50కిపైగా వాహనాలను సీజ్ చేశారు. పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఘటనపై త్వరలోనే మరిన్ని అరెస్ట్‌లు చేస్తామని చెప్పారు. అలాగే, ఘటన వెనుకున్న వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు.