దేశ రాజకీయాల్లో ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాషాయదళం ప్రయత్నాలు చేస్తోండగా.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు జేడీఎస్ కూడా కింగ్ మేకర్‌గా ఎదగాలని చూస్తుండటంతో.. కర్ణాటక పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి.
ఈ క్రమంలో కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ యువ మోర్బా నేత ప్రవీణ్ కమ్మర్ తాజాగా హత్యకు గురికావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం బీజేవైఎం ధార్వాడ్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కొత్తూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రవీణ్ కమ్మర్ ఉన్నాడు. మంగళవారం కొంతమంది దుండగులు అతడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ యువ నేత హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.
ధార్వాడలోని ఆలయ ఉత్సవం సందర్భంగా మంగళవారం కమ్మర్, కొంతమంది తాగుబోతుల మధ్య గొడవ జరిగింది. ఆలయ ఉత్సవం ముగిసిన తర్వాత జాతరను బయటకు తీస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న కొంతమంది ప్రవీణ్‌తో వాగ్వాదానికి దిగారు. ప్రవీణ్ గట్టిగా వాదించడంతో మద్యం మత్తులో ఉన్నవారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగొచ్చి ప్రవీణ్, అతడి మద్దతుదారులపై దుర్భాషలాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రవీణ్ కమ్మర్‌ను గట్టిగా కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడ నుంచి పరార్ అయ్యాడు. ప్రవీణ్‌ను వెంటనే అతడి మద్దతుదారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ప్రవీణ్ మద్దతుదారుల ఫిర్యాదుతో గరగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ దారుణ హత్యపై బీజేపీ యువ మోర్బా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య స్పందించారు. ప్రవీణ్‌ను రాజకీయ కక్షలతోనే దారుణంగా హత్య చేశారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకుడి హత్య కలకలం రేేపుతోంది. ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు.