పాఠశాల విద్యా శాఖలో దాదాపు 10 వేల ఖాళీల ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలో ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన శుక్రవారం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది మెగా డీఎస్సీ ఉంటుందని చెప్పారు. పాఠశాల విద్యా శాఖలో దాదాపు 10 వేల ఖాళీలను గుర్తించినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను చట్ట ప్రకారం క్రమబద్ధీకరిస్తామన్నారు. టీచర్ల బదిలీ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కర్ణాటక తరహాలో ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం బదిలీలు చేస్తామన్నారు. టీచర్ల బదిలీకి సంబంధించి చట్టం తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. బదిలీకి సంబంధించి పారదర్శకమైన విధానం తీసుకు వస్తామన్నారు.
విశాఖపట్నం నుండే పరిపాలన తమ పాలసీ అని బొత్స పునరుద్ఘాటించారు. ప్రజలను డైవర్షన్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. మూడు రాజధానుల అంశంపై తమలో ఎలాంటి మార్పు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ అంశమన్నారు. ఎవరి కోసమో తాము ఈ నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆయన మంచి నటుడు అని, మానిప్యులేటర్ కూడా అని అన్నారు. చంద్రబాబు కాపురం కోసం అమరావతిలో రాజధానిని పెట్టారా... అమరావతి రాజధాని అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఎందుకు కాపురం పెట్టారు... కాపురానికి, రాజధానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలో ఉండాలనేది తమ విధానమని బొత్స చెప్పారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ తో అందరి వ్యవహారం బయటపడిందని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పారు.