తిరుపతి నగరంలో టీటీడీ చౌల్ట్రీస్ రెండో సత్రాలు ఎదురుగా గ్రీన్ పార్క్ అపార్ట్‌మెంట్ వాసుల రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కార మైంది. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను మూడు రోజుల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి పరిష్కరించారు. సమస్య పరిష్కారంలో అభినయ్ చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో 200 కుటుంబాలున్నాయి. అపార్ట్‌మెంట్ పేరు గొప్పగా ఉన్నా, వారికి ఇరుకు మార్గం తప్ప మరో రవాణా సౌకర్యం లేదు. ఏదైనా అత్యవసరమైతే డీఆర్ మహల్ వద్దనున్న అండర్ బ్రిడ్జి మార్గమే దిక్కు వర్షాకాలంలో ఆ బ్రిడ్జి నీటితో నిండి వుంటుంది. దీంతో రవాణా సౌకర్యం బంద్. ఒక్కోసారి ప్రాణపాయ పరిస్థితులు ఎదురైతే దేవుడిపై భారం వేయాల్సిన దుస్థితి.
తిరుపతి నగరంలో ఇలాంటి దుస్థితి ఉండడంపై అభినయ్‌రెడ్డి ఆందోళన చెందారు. సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. నేరుగా గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంట్ వద్దకెళ్లారు. ఇరుకు మార్గం మాత్రమే వుండడాన్ని చూశారు. మూడు దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేని విషయాన్ని స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు, అపార్ట్‌మెంట్‌వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేషన్ అధికారులు, మఠం సంబంధిత అధికారులతో అభినయ్‌రెడ్డి చర్చించారు. వెంటనే 33 అడుగుల సిమెంట్ రోడ్డును దగ్గరుండి వేయించారు. దీంతో మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపినట్టైంది.