జగనన్న పాల వెల్లువ పథకంలో రైతులకు కలిగే ప్రయోజనాలను గూర్చి పాడి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు చిక్కాల రామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అనకాపల్లి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను స్థాపించాలని పీఎం కిసాన్ కేవైసీలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సలహా మండలి సభ్యులు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి మాట్లాడుతూ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించా లన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పట్ల అవగాహన కల్పించి వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు.సమావేశంలో ముందుగా చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను గూర్చి సమీక్షించారు వ్యవసాయం, అనుబంధ రంగాలు కు చెందిన శాఖలలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు గురించి జిల్లా వ్యవసాయ అధికారి తెలియజేశారు విత్తనాలు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయిందని చెప్పారు.
ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్పర్సన్ పి చింతల్లి, సలహా మండలి సభ్యులు ఆర్ గంగు నాయుడు వి అచ్చం నాయుడు ఎస్ రమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు, ఉద్యానవన, మార్కెటింగ్, పశుసంవర్ధక, బ్యాంకు తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.