శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురంలోని బాహుదానదిపై వంతెన కూలిపోయింది. 1929లో బ్రిటీష్ కాలంలో దీనిని నిర్మించగా శిథిలావస్థకు చేరుకుంది. ఒడిశా రాష్ట్రం అస్కా నుంచి ఒంగోలుకు.. 80 టన్నుల గ్రానైట్ లోడుతో లారీ వెళ్తుండగా.. రెప్పపాటులో వంతెన కూలిపోయింది. నదిలో లారీ ఒకవైపు, గ్రానైట్ రాయి మరోవైపు పడిపోయింది. లారీడ్రైవర్, క్లీనర్ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో వంతెనపై ప్రజల రాకపోకలు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ వైపు ఇసుకాసురుల ఆగడాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇచ్ఛాపురంలో గ్రామదేవత సంబరాలు జరుగుతున్నాయి. హెవీ వెహికల్స్‌కు అనుమతులు ఇవ్వబోమని చెప్పిన పోలీసులు.. ఈ వాహనాన్ని ఎందుకు అనుమతిచ్చారో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. కొత్త జాతీయ రహదారిపై కాకుండా.. పోలీసుస్టేషన్ మీదుగా ఈ వాహనం వెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వంతెన నిర్మించి 94 ఏళ్లు దాటింది. శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు ఈ వంతెన తొలగించి.. కొత్తది నిర్మించలేదని పేర్కొంటున్నారు.