ఆర్- 5 జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుప్రీంను ఆశ్రయించారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు వాపోయారు. రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రైతులు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు.