ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ డైకిన్ ఇండియా దేశీయ మార్కెట్లో కీలక బిలియన్ డాలర్ల టర్నోవర్ మైలురాయిని అధిగమించినందున ఆసంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జావాకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి మంగళవారం సాయంత్రం అభినందనలు తెలిపారు. కన్వాల్‌జీత్ జావాకు డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పంపిన అభినందన సందేశంలో శీతలీకరణ పరిశ్రమలో 2023 ఆర్థిక సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి అంతర్జాతీయ కంపెనీగా డైకిన్ ఇండియా ఆవిర్భవించినందుకు తాను సంతోషిస్తున్నాను అని పేర్కొంటూ, కన్వాల్‌జీత్ జావా నాయకత్వంలో డైకిన్ ఇండియా కార్యకలాపాలు ప్రతి విభాగంలోనూ మార్కెట్ లీడర్ గా నిలిచిందని ఆయనకు, డైకిన్ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఉన్నత ప్రమాణాలు కలిగిన డైకిన్ ఇండియా ఎయిర్-కండీషనర్లు (ఏసీలు) మరియు కంప్రెసర్‌ల అతిపెద్ద తయారీ కేంద్రం శ్రీసిటీలో నేలకొల్పినందుకు గర్విస్తున్నాము అని చెప్పారు. ఈ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైతే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో డైకిన్ ఇండియా వ్యాపారం రెండింతలై 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డైకిన్ విజయ ప్రస్థానం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పనపై దృష్టి సారించి శ్రీసిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ హబ్‌ని స్థాపించడానికి డైకిన్ చూపుతున్న చొరవ అత్యంత ప్రశంసనీయమని అన్నారు. డైకిన్తో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన, ఆ సంస్థ భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.