మహిళా క్రీడాకారులపై లైంగిక దాడులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఐద్వా, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏపీ రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం క్లాక్‌టవర్ నుంచి రఘువీర టవర్స్ వరకు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ దేశ కీర్తిప్రతిష్టలను తమ క్రీడా నైపుణ్యంతో ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేస్తున్న మహిళా రెజ్లర్లకు దేశం లో సరైన గౌరవం ఇవ్వకపోగా, లైంగిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. గత 25 రోజులుగా ఢిల్లీలో రెజ్లర్లు ధర్నా సాగిస్తున్నారంటే ఈ దేశంలో మోదీ నాయకత్వంలో పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఆ ఎంపీచే అత్యాచారాలు, అవమానాలకు గురికాబడిన మహిళా రెజ్లర్లు అందరూ గతంలోనూ నిరసన తెలిపినా, క్రీడాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రజాసంఘాలను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురా లు నాగమణి, ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పరమేష్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, బాలకృష్ణ పాల్గొన్నారు.