ఎస్సీ వర్గీకరణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం డోన్ పట్టణంలోని గుత్తిరోడ్డులో ఉన్న కమ్యూనిటీ హాలులో ఉమ్మడి జిల్లాల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసి 29 సంవత్సరాలుగా పోరాడుతున్నామన్నారు. అయితే చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి వాటి బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్దతకు కేంద్రంలో కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయనీ, వీటి కోసం ఉద్యమాలు తీవ్రతరం చేసి కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఈశ్వరయ్య మాదిగ, జిల్లా కోకన్వీనర్ సుభాష్ చంద్ర, ఎంవీఎఫ్ జాతీయ నాయకులు బుచ్చన నరసింహులు, నాయకులు శ్రీరాములు, భాస్కర్, తాటికొండ నారాయణ, పులికేశవయ్య తదితరులు పాల్గొన్నారు.