విశాఖపట్నం సంసద్ ఆదర్స్ గ్రామ యోజన ద్వారా గ్రామాల్లో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు యం. వి. వి. సత్యన్నారాయణ అధ్యక్షతన సంసద్ ఆదర్స్ గ్రామ యోజన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ లు స్థానిక యం. పి. టి. సి మరియు యం. పి. పి సహకారంతో సంసద్ ఆదర్స్ గ్రామ యోజన లో చేయవలసిన పనులు గుర్తించి సంబందిత ప్రతిపాదనలను మండల పరిషత్ అభివృద్ది అధికారికి అందజేయాలన్నారు. తద్వారా తదుపరి పనులు మంజూరు నిమిత్తము మండల పరిషత్ అభివృద్ది అధికారి పార్లమెంట్ సభ్యులకు అందజేసి యంపి నిధుల ద్వారా పనులు మంజూరు చేయబడతాయన్నారు.
పార్లమెంట్ సభ్యులు యం. వి. వి. సత్యన్నారాయణ మాట్లాడుతూ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ది అధికారి గ్రామము మొత్తం సర్వేచేసి అవసరమైన పనులు గుర్తించాలన్నారు. స్దానికంగా అందుబాటులో ఉన్న నిదులు లభ్యతను బట్టి కేటాయింపు చేసి మిగిలిన పనులకు తగు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.