ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదిలావుంటే వై.ఎస్.జగన్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న తర్వాత.. ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. జగన్ ఢిల్లీకి వెళ్లే ముందు తాడేపల్లిలో సమావేశాన్ని ముందుగా ప్లాన్ చేశారు. అయితే.. ఇది వాయిదా పడింది. ఆ తర్వాత ఢిల్లీలో ప్లాన్ చేశారు.
2019 ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ఐప్యాక్ సీఎం జగన్‌తో కలిసి పని చేస్తోంది. ఐపీఏసీ నుంచి వైదొలిగినట్లు ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ.. ఆయన తన టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఏపీలోని ఐపీఏసీ బృందం.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. వీరిద్దరి భేటీలోను 175 నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగినట్టు సమాచారం.
2024 ఎన్నికల్లో కొత్త వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదని.. తన నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఎన్నికల వ్యూహకర్త సీఎంకు సూచించినట్టు తెలుస్తోంది. జగన్ తన పని తీరును బేరీజు వేసుకుని.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. అలాగే.. 2024 ఎన్నికల్లో 25 మంది సిట్టింగ్‌ను తప్పించి.. కొత్త వారిని బరిలోకి దించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసే 175 మంది అభ్యర్థుల గురించి జగన్, పీకే సమీక్ష జరిపినట్టు సమాచారం.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించారు. కానీ.. ఇటీవల ఆయన్ను అభ్యర్థిగా తప్పించారు. పీకే, ఐప్యాక్ టీమ్ సలహా మేరకు.. దువ్వాడ శ్రీనివాస్ భార్యను టెక్కలి అభ్యర్థిగా ప్రకటించారు. టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు అయిన దువ్వాడ వాణిని.. టెక్కలి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఈనెల 27న ప్రకటించారు. అలాగే త్వరలో మరికొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.