విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు పాలకమండలి గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయానికి సంబంధించిన అభివృద్ది పనులు, త్వరలో చేపట్టే కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఎజెండాలోని పలు అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలతో ఎజెండాను ప్రవేశపెట్టి 11 ఆమోదించి, 9 వాయిదా, 4 రీకాల్ చేశారు. ప్రధానంగా భూముల కౌలు, ఒక నెలకు ఆవు నెయ్యి టెండర్, శానిటరీ, సెక్యూరిటీ టెండర్లు, దాత సంగా నరసింహారావు ఇచ్చిన విరాళంతో కొండపై రాతి యాగశాల నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదించారు.. మరికొన్ని అంశాలను వాయిదా వేశారు.
మహామండపంలో దాతల సహకారంతో సరుకులను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు. సరుకుల టెండర్లు ఒకే వ్యక్తికి కట్టబెట్టడం వల్ల మోనోపలి పెరుగుతుందని.. అలా కాకుండా సరుకులను విడదీసీ ఐటమ్‌లవారీగా టెండర్లు పిలవాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆలయం నిర్వహిస్తున్న బస్సులు పరిమిత మార్గంలోనే నడుస్తున్నాయని.. మరికొన్ని రూట్లలో మార్చాలని భావిస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ 10వ నెంబరు ప్లాట్‌ఫాంతో పాటు గట్టువెనుక, ఇంకా ముఖ్యమైన పలు ప్రాంతాల్లో బస్సులు తిరిగేందుకు రూట్‌ను పరిశీలిస్తున్నారు.
అలాగే అమ్మవారి కానుకలను లెక్కించే సేవకులకు రెండు పులిహార పొట్లాలు, ఒక లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు ఆమోదం తెలిపారు. అన్నదాన విభాగంలో శుక్ర, ఆదివారాల్లో 4 వేల మందికి, మిగతా రోజుల్లో 3 వేల మందికి అన్నదానం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాతల సహకారంతో పది వీల్‌చైర్లను కొనుగోలు చేయనున్నారు.