ఏసీబీ దాడుల్లో అవినీతి చేప చిక్కింది. స్థలాన్ని నిషేధిత 22ఏ జాబితా నుంచి తొలగిస్తానంటూ రూ. 30వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్‌ఓను విశాఖలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. చినగదిలి మండలం అడివివరం వీఆర్‌ఓగా పనిచేస్తున్న జామి రాము ప్రస్తుతం సింహాచలం ప్రొటోకాల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తనకు ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉందని చెప్పి గోపాలపట్నం మండలం బుచ్చిరాజుపాలెంకు చెంది కె.విశ్వేశ్వరరావుకు చెందిన ఆస్తిని నిషేధిత జాబితా నుంచి తప్పిస్తానని నమ్మించాడు.
ఈ పని చేసేందుకు జామి రాజు రూ.30 వేలు లంచంం ఇవ్వాలని డిమాండ్ చేసి.. అడ్వాన్సుగా రూ.10వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో విశ్వేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం పూర్ణామార్కెట్ ప్రాంతంలో రాము లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్‌వో పరిధిలో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.