అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎస్‌కేఆర్ లాడ్జిలో సోమవారం జరిగిన హత్య కేసు దర్యాప్తులో అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం రైతుభరోసా కేంద్రంలో పనిచేస్తున్న కూర్మన్నపాలేనికి చెందిన ఎస్.మహాలక్ష్మి లాడ్జిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గదిలో ఆమె భర్త, గాజువాకకు చెందిన శ్రీనివాసరావు కూడా కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో పడివుండడంతో ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను శ్రీనివాసరావు హత్య చేసి, తాను ఆత్మహత్యానికి యత్నించి వుంటాడని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా లాడ్జి రూమ్‌లో తనిఖీ చేసిన పోలీసులకు కొన్ని సిరంజిలు లభించాయి. దీంతో మహాలక్ష్మిని హత్య చేసేందుకు ముందుగానే శ్రీనివాసరావు ప్రణాళిక రచించాడని అర్థమవుతోంది. మహాలక్ష్మికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా లేదంటే ఆహారంలో మత్తు మందును కలిపి అపస్మారక స్థితిలోకి నెట్టిన తర్వాత హత్య చేస్తే ప్రతిఘటన ఉండదు కాబట్టి, తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోవచ్చునని శ్రీనివాసరావు భావించి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా లాడ్జి గదిలో రెండు కత్తులు కూడా పోలీసులకు లభించాయి. ఇదిలావుండగా మహాలక్ష్మి మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం చేశారు. ఆమె శరీరంపై 16 కత్తిపోట్లు వున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు నిమిత్తం కేజీహెచ్‌కు వచ్చిన డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ లాడ్జి రూమ్‌లో కొన్ని ఇంజక్షన్లు, రెండు కత్తులు లభ్యమయ్యాయని, సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన తర్వాత దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.