జిల్లాలో నిర్వహిస్తున్న స్పందన ( జగనన్నకు చెబుదాం ) కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పందనలో పునఃప్రారంభమైన, సంతృప్తికరంగా లేని ఆర్జీలపై గృహ నిర్మాణం, పోలీస్, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్, ఆర్. డబ్ల్యు. ఎస్, ఈ. పి. డి. సి. ఎల్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో జెసి సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ అర్జీదారులకు అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందనందునే ఆర్జీలు మరలా ఓపెన్ అవుతున్నాయన్నారు.
సంతృప్తి చెందని అర్జీలు 17 ఉండగా, పునఃప్రారంభమైన అర్జీలు 13 ఉన్నాయని అన్నారు. స్పందన ద్వారా అర్జీదారులు లాభపడాలని, ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవకులుగానే భావించాలని, కావున ప్రజలకు జవాబు దారీగా పనిచేయాలని సూచించారు. స్పందనలో వచ్చే ఆర్జీలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ కోరుతూ పలు సమావేశాలు నిర్వహించిన సంగతిని జెసి గుర్తుచేశారు. అయినప్పటికీ మొక్కుబడిగా అర్జీదారులకు సమాధానాలు ఇస్తూ సమస్యను దాటవేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారని, ఇకపై ఇలాచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్జీదారులకు మీరిచ్చే ఎండార్స్ మెంట్లు పక్కాగా ఉండాలని, అవి అప్లోడ్ చేసినపుడు స్పష్టంగా కనిపించేలా చూడాలని తెలిపారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది మంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఆర్జీలపై తీసుకున్న చర్యలపై ఫొటోలు ఉండాలని, అలాగే అర్జీదారుడు సంతృప్తి చెందినట్లు స్పందన తీసుకోవాలని జెసి వివరించారు. వచ్చిన అర్జీలలో పలు శాఖలతో సంబంధం ఉన్నపుడు పిఎంయు (ప్రోజెక్టు మోనటరింగ్ యూనిట్)తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలే తప్ప, శాఖల వారీగా దాటవేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఏది ఏమైనప్పటికీ అర్జీదారుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దని తేల్చిచెప్పారు.
ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి కృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. వెంకట రామన్, జిల్లా పంచాయతీ అధికారి వి. రవి కుమార్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్. గణపతి రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శాంతి, నగర పాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, జిల్లా సరఫరాల అధికారి డి. వి. రమణ, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. కిషోర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కె. ప్రభాకర రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.