వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని చెప్పారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో.. ఫోన్ లైన్‌లో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
సుప్రభాత సేవ విచక్షణ కోటాను రద్దు చేశామని.. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతారని అన్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని ఈ విషయాన్ని భక్తులు మర్చిపోవద్దని ఈవో విజ్ఞప్తి చేసారు. వేదాల్లోని అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ, గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారం తీసుకోవాల్సిన విధానం లాంటి దాదాపు 190 అంశాలను భావితరాలకు తెలియజేసేందుకు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదిక్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించామన్నారు.