టీడీపీ హయాంలో చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తుందని కొందరు యువగళం పాదయాత్రలో లోకేశ్ దృష్టికి తెచ్చారు. దానికి ఆయన బదులిస్తూ... రాయలసీమలో కాంట్రాక్టర్లు రెడ్లేనని, వారిని కూడా జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎం అయిన 12 రోజుల్లోనే తన తమ్ముడు హత్యకు గురయ్యాడని, పిల్లలను ఆదుకోవాలని వేముల మండలానికి చెందిన రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేయగా, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆదుకుంటామన్నారు. తన కొడుకును హత్య చేసి.. ఆస్తి లాక్కునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మునెమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేయగా... దీనికి లోకేశ్ స్పందిస్తూ... మునెమ్మ కుమారుడిని ప్రత్యర్థులు చంపేస్తే పిల్లలను టీడీపీ చదివిస్తోందని, అదీ రెడ్ల పట్ల టీడీపీ చూపుతున్న శ్రద్ధ అన్నారు. చదువుకున్న రెడ్ల యువత రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, వారికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రసాద్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై లోకేశ్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చాక పారిపోయిన పరిశ్రమలను తెచ్చి.. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.