గుడివాడలో టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవం ఎందుకు వాయిదా వేశారంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నాలుగేళ్లుగా కళ్ళు కాయలు కాసెలా ఎదురుచూస్తున్న పేదలను ఇంత మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. చిటీ పాటల మాదిరి ఫ్లాట్ల ప్రారంభోత్సవాన్ని... ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ వాయిదాలు వేస్తున్నారన్నారు. నేనెంత చెబితే జగన్‌కు అంతే అంటూ సొల్లు కబుర్లు చెప్పే కొడాలి నాని ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 80 శాతం పూర్తి చేసిన ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారన్నారు. అధికారులు మోసపోవద్దని.. వ్యవస్థను అనుసరించాలని సూచించారు. చంద్రబాబు కష్టం, వెంకయ్య నాయుడు సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. తమ కష్టం నాశనం అవుతుందని రోజు మొత్తుకుంటున్నప్పటికీ చివరికి జరిగిందేంటి అని నిలదీశారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు. 9 నెలలు ఓపిక పడితే, సీఎం హోదాలో చంద్రబాబు చేతుల మీదుగా ఫ్లాట్లను అప్పగిస్తామని రావి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.