హరియాణాలో ఘోరం చోటు చేసుకొంది. రెండు వర్గాల ఖైదీల మధ్య జరుగుతోన్న ఘర్షణను నిలువరించడానికి ప్రయత్నించిన జైలు వార్డర్‌పైనే కొందరు దాడికి పాల్పడ్డారు. గొడవను ఆపే ప్రయత్నం చేసిన వార్డర్‌పై ఖైదీలు స్క్రూడ్రైవర్లతో ఖైదీలు దాడిచేసిన ఈ ఘటన హరియాణాలోని అంబాలా సెంట్రల్ జైలులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వార్డర్ అరుపులు విని అక్కడకు పరుగెత్తుకొచ్చిన మిగతా జైలు సిబ్బంది వారి బారి నుంచి ఆయనను రక్షించారు. ఈ ఘటనపై జైలు సిబ్బంది బల్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. అంబాలా సెంట్రల్ జైలు బ్లాక్-5 బ్యారక్ ఇంఛార్జి రమేశ్ సింగ్.. మంగళవారం సాయంత్రం ఖైదీలను లెక్కించడానికి వెళ్లారు. బ్యారక్ గేటు తెరిచేసరికి రెండు గ్రూపులుగా విడిపోయి ఖైదీలు ఘర్షణ పడుతున్నారు. దీంతో గొడవలో జోక్యం చేసుకుని, వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో హత్యాయత్నం కేసులో ఆరు నెలల కిందట అరెస్టయిన ఖైదీల్లో ఓ వ్యక్తి, అతడి అనుచరులు చిన్న స్క్రూడ్రైవర్లతో దాడి చేసి పొడిచి చంపడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకుంటూ రమేశ్ సింగ్ ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు.
ఈ అరుపులు విన్న మిగతా బ్యారక్స్‌లోని జైలు సిబ్బంది అక్కడకు తక్షణమే చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో రమేశ్ సింగ్‌కు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. అయితే, సకాలంలో సిబ్బంది రావడం వల్ల త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఈ ఘటనలో 10 మందిపై కేసు నమోదుచేసినట్టు బల్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి తెలిపారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా? స్క్రూడ్రైవర్లు వీరికి ఎక్కడ నుంచి వచ్చాయి? అనేది దర్యాప్తులో వెల్లడవుతుందని పేర్కొన్నారు. విచారణ మొదలుపెట్టామని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa