ఈ నెల 23న జరిగిన హత్య కేసును కడప సబ్ డివిజన్ పోలీసులు చేదించారు. సంచలనం రేపిన వైసిపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో 6 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు.
పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామానికి చెందిన మోపురు ప్రతాప్ రెడ్డి, కడప పాలెంపల్లి గ్రామానికి చెందిన మెరువ శ్రీనివాసులు, కడప నగరం పాత కడపకు చెందిన కల్లూరు సురేష్ కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, కడప నగరం పుచ్చళ్లపల్లి సుందరయ్య కాలనీకి చెందిన బరకం హరిబాబు, కడప వార్డు వాలంటీర్ కోనేరు వెంకట సుబ్బయ్య, కడప నగరం పాత కడపకు చెందిన పత్తురు భాగ్య రాణిలను హత్య కేసులో నిందితులుగా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎస్పీ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే హత్యకు కారణం అని తెలిపారు. కేసును సత్వరమే చేదించిన కడప డిఎస్పీ షరీఫ్, సిఐలు నాగరాజు, అశోక్ రెడ్డిలు, ఎస్సై మధుసూదన్ రెడ్డిలు సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.