ఏపీ గురుకుల జూనియర్ కాలేజీల(ఏపీఆర్‌జేసీ) లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది జీతాలు లేక గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని ఏపీఆర్‌జేసీల్లో 500 మంది పనిచేస్తున్నారు. వీరిలో 300 మంది జూనియర్ లెక్చరర్లు, 200 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరి జీతాలను ప్రభుత్వ బడ్జెట్ నుంచి త్రైమాసికం ప్రాతిపదికన విడుదల చేస్తారు. కాలేజీల్లోని విద్యార్థుల డైట్ చార్జీలతో కలిపి వేతనాలు, ఇతర అవసరాలకు నెలకు రూ.3 కోట్లు అవసరం అవుతాయి. ఇలా మూడు నెలల కాలానికి రూ.9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. లెక్చరర్ల ఆందోళన, వినతుల నేపథ్యంలో సంబంధిత అధికారులు కొన్నాళ్ల కిందట రూ.5 కోట్లు విడుదల చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపినట్టు తెలిసింది. అయితే, ఆ నిధులు కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. గతేడాది నుంచి తరచూ నెల రోజులు ఆలస్యంగా జీతాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 3 నెలలు పెండింగ్ పెట్టారని లెక్చరర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 1 నాటికి మూడు నెలల జీతాలు చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏపీ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. 2వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసనలు తెలుపుతామని, 9వ తేదీ నుంచి భోజన విరామ ఆందోళనలు చేపడతామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. మధుసూదనరావు, యు. సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.