రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా ప్రధాన కేసులను గుర్తించామని, నిందితులకు కచ్చితంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేసుల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు సంబంధిత జడ్జీలు, పీపీలతో సమన్వయం చేసుకొని జీవిత ఖైదు, అంతకంటే ఎక్కువ శిక్షలు పడే విధంగా కేసులు పరిష్కరిస్తారని చెప్పారు. గత ఏడాది పోల్చితే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గిందని తెలిపారు. మహిళా పోలీసుల వల్లే అన్‌ఐడెంటిఫైడ్ కేసులు గుర్తించగలుగుతున్నామంటూ ప్రశంసించారు. దిశా చట్టం వచ్చాకే మహిళలపై నేరాల సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. డీఐజీ సెంథిల్ కుమార్, కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.